పరిష్కార వేదికకు 114 వినతులు | - | Sakshi
Sakshi News home page

పరిష్కార వేదికకు 114 వినతులు

Mar 17 2026 7:37 AM | Updated on Mar 17 2026 7:37 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 114 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్‌ స్వయంగా వినతులు స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకున్నారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొబేటషనరీ ఐపీఎస్‌ అధికారి అశ్విని మణిదీప్‌, డీఎస్పీ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు సర్వేయర్ల సస్పెన్షన్‌

పాపంపేట భూవ్యవహారం..

అనంతపురం అర్బన్‌: పాపంపేట భూ వ్యవహారంలో మండల సర్వేయర్లు ప్రతాపరెడ్డి, రఘునాథ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు సర్వే భూ రికార్డుల శాఖ డైరెక్టర్‌ రోనంకి కూర్మనాథ్‌ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. పాపంపేట భూముల వ్యవహారంలో సర్వేకు సంబంధించి అవతకవలపై డీఐఓఎస్‌ (డిస్ట్రిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే) ద్వారా సమగ్ర విచారణ జరిపించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 300 ఎకరాల సర్వేకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు విచారణ నివేదిక వచ్చిందన్నారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం మండల సర్వేయర్‌గా ఉన్న వి.ప్రతాపరెడ్డి, అనంతపురం రూరల్‌ మండల సర్వేయర్‌ బి.రఘునాథ్‌ అవకతకవలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు అనంతపురం ఆర్డీఓ సిఫారసు చేశారన్నారు. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో డైరెక్టర్‌ పేర్కొన్నారు. అదే క్రమంలో వారిద్దరూ ముందస్తు అనుమతి లేనిదే జిల్లా కేంద్రం విడిచి వెళ్ల కూడదని అందులో పేర్కొన్నారు.

ఖాళీ బిందెలతో నిరసన

రాయదుర్గం టౌన్‌: స్థానిక కణేకల్లు మార్గంలోని ఎంసీఏ ఇందిరమ్మ లే అవుట్‌ వాసులు తాగునీటి కోసం సోమవారం నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టారు. కాలనీలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయని, బోర్లన్నీ పనిచేయకపోవడంతో తాగునీరు లభ్యం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులు పంపిస్తున్న రెండు ట్యాంకర్ల నీరు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. తమకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి కొళాయిలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మద్దతు తెలిపారు. సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement