కణేకల్లు: సీ్త్ర శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన చంద్రబాబు సర్కార్... తెర వెనుక మాత్రం బస్సుల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో అధిక సామర్థ్యంతో ప్రయాణికులను మోయలేక బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. రాయదుర్గం–ఉరవకొండ మార్గంలో రోజూ ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు లోనవుతూ ఆగిపోవడం పరిపాటిగా మారింది. రాయదుర్గం–ఉరవకొండ కణేకల్లు మీదుగా రాయదుర్గం డిపోకు చెందిన 5 బస్సులు, ఉరవకొండ డిపోకు చెందిన 4 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ పూర్తి పాతవి. మరమ్మతులకు లోనై ప్రతిసారీ సరి చేయడం మళ్లీ రూటుకు పంపడం అధికారులకు పరిపాటిగా మారింది. నిర్వహణ లోపం కారణంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు అవి కాస్త మొరాయిస్తున్నాయి. తాజాగా సోమవారం కణేకల్లు శివారున వేదవతి హగరిలో రాయదుర్గం డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వెళుతూ జాయింట్ రాడ్ కట్ కావడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో మండుటెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


