అనంతపురం సెంట్రల్: సిలిండర్ల అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ప్రసాద్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లులో హనుమాన్ జంక్షన్ దగ్గర బాలాజీ కేఫ్‌లో 4 సిలిండర్లు సీజ్ చేసి నిర్వాహకుడు అనుముల సురేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే గుత్తి గాంధీ సర్కిల్‌లో గ్యాస్ స్టౌవ్ రిపేరీ దుకాణంలో 12 సిలిండర్లు, గ్యాస్ ఫిలింగ్ పైపు సీజ్ చేసి నిర్వాహకుడు చిన్న మహమ్మద్‌పై కేసు నమోదు చేశారు. కదిరి పట్టణంలో ఓ ఇంట్లో 46 సిలిండర్లు సీజ్ చేసి డెలివరీ బాయ్‌పై కేసు కట్టారు.చట్ట విరుద్ధంగా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐ గోపాలుడు, ఏఈఈ రవీంద్ర నాథ్, రాజశేఖర్, సీఎస్‌డీటీ భాగ్యలక్ష్మి, ఆర్‌ఐ రవికుమార్, కదిరి వీఆర్వో ఆదినారాయణమ్మ, హరీష్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో
యువకుడు మృతి
కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధి లోని ముదిగల్లు గ్రామంలో విద్యుత్ షాక్‌తో రాము (24)అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... ముదిగల్లుకు చెందిన రాము, లక్ష్మి దంపతులు. ఉగాది పండుగ నేపథ్యంలో శనివారం రాము ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలోనే విద్యుత్ మోటర్ పట్టుకోవడంతో షాక్ కొట్టింది. స్పృహ తప్పి కిందపడిన రామును వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక సీహెచ్‌సీకీ తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మి ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం. పండుగ దగ్గర పడుతున్న సమయంలో కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


