● యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు కోటేశ్వరప్ప, ఈశ్వరయ్య
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు కోటేశ్వరప్ప, ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎన్‌రోల్‌మెంట్ పెంచే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. జిల్లాలో ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్‌రోల్‌మెంట్ పెంచే కార్యక్రమంపై దృష్టి పెట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. రాబోయే రోజులలో రోజూ సాయంత్రం గ్రామాలలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. సమావేశంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, సహాధ్యక్షులు సరళ, జిల్లా కార్యదర్శి అర్జున్, సంజీవులు, రవికుమార్ చంద్రమోహన్, రామాంజనేయులు పాల్గొన్నారు.


