ఉరవకొండ: స్థానిక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దీనిపై రోగులు, వారి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో అబ్దుల్ అనే వ్యక్తి (ఓపీ చీటీ నం. 18265) వైద్యుడికి చూపించుకున్న అనంతరం మాత్రల గది వద్ద మాత్రలు తీసుకున్నాడు. మాత్రల గడువు ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసినట్లు షీట్‌పై ఉండటంతో, ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నించాడు. వారేమో నిర్లక్ష్యంగా ఒకటో రెండో ఇలాంటివి వచ్చి ఉంటాయిలే అంటూ సమాధానమిచ్చారని అబ్దుల్ వాపోయాడు. జ్వరం, విరేచనాల బాధిత రోగులకు కూడా కాలం చెల్లిన మాత్రలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే వైద్య సేవలు నామమాత్రంగా మారాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఆస్పత్రి వైద్యాధికారులు, జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని రోగులు కోరుతున్నారు.


