గరుడ వాహనంపై ఖాద్రీశుడు | - | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై ఖాద్రీశుడు

Mar 9 2026 7:24 AM | Updated on Mar 9 2026 7:24 AM

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన ఆదివారం రాత్రి మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహునికి వాహనంగా మరోసారి పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ.. మలి గరుడసేవ అని కూడా అంటారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరు వీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం మళ్లీ రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పు దేవున్ని దర్శించుకున్నారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మెన్‌ రెడ్డెప్పశెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గిరి ప్రదక్షిణ...

లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు ఆదివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో కదిరి కొండ వద్దకు చేరుకొని ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులు గత ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భవిష్యత్‌లో గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య బాగా పెరగవచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు.

నేడు గజ వాహనం..

ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సోమవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement