సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం

సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ‘అక్షరాంధ్ర’ లక్ష్యమని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరం మున్నా నగర్‌లోని వయోజన విద్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,25,578 మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ‘అక్షరాంధ్ర’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా శాఖల ద్వారా వాలంటరీ టీచర్లు, అభ్యాసకులను గుర్తించి, వారికి బోధనాభ్యసన ప్రక్రియను అందిస్తున్నట్లు వివరించారు. ‘అక్షరాంధ్ర’లో భాగంగా మెప్మా పరిధిలోని స్వయం సహాయక బృందాల సభ్యుల్లో 37,500 మందిని, డీఆర్‌డీఏ ద్వారా 62,500 మందిని, ఉపాధి హామీ పథకం పరిధిలో 25,000 మంది వేజ్‌సీకర్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న లబ్ధిదారులకు మొత్తం 100 గంటల పాటు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం (కూడికలు, తీసివేతలు)పై బోధన అభ్యసన ప్రక్రియ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ప్రభుత్వం గుర్తించిన వాలంటరీ టీచర్ల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం అవసరమైన పాఠ్య పుస్తకాలు, వర్క్‌ షీట్లు అందజేయడంతో పాటు, వీడియో పాఠ్యాంశాల ద్వారా కూడా బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు. బోధనాభ్యసన ప్రక్రియ అనంతరం లబ్ధిదారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ నెల చివరి వారంలో ప్రీ–ఫైనల్‌ పరీక్షలు, మార్చి 29న ఫైనల్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ వయసులో చదువు అవసరమా అనే సందేహాలు పక్కనపెట్టి, అక్షరాస్యత వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు సంపంగి వెంకటేశ్వర్లు, సిబ్బంది సూర్యనారాయణ, శ్రీధర్‌, రమణ, లక్ష్మీనారాయణ, లక్ష్మీప్రసన్న, ఆర్పీలు రాణి, సునంద, మాధవి, వాలంటరీ టీచర్‌ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

అనంతపురం అర్బన్‌: ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ను ఏపీ ఎన్‌జీజీఓ సంఘం నాయకులు కోరారు. కలెక్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్‌, కార్యదర్శి రవికుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలుకా నాయకులు కలిశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. అనంతరం సంఘం క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శ్రీధర్‌బాబు, దస్తగిరి, జమీల బేగం, లక్ష్మినారాయణ, అనంతయ్య, లింగమేష్‌, కోశాధికారి ప్రవీణ్‌, సంయుక్త కార్యదర్శులు రిషికేష్‌, లక్ష్మినరసయ్య, నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, నాయకులు అక్కులప్ప, శ్రీనివాసులు, మధుబాబు, సుదర్శన్‌శర్మ, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement