పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే వేతనాలివ్వాలి
అనంతపురం అర్బన్: కార్మికుల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో సంఘం జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్యతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. కనీస వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయడం లేదన్నారు. కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే అరకొర వేతనాలను నెలలుగా బకాయి పెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ వేధింపులు, తొలగింపులు అధికమయ్యాయన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికుల శ్రమను కార్పొరేట్‌లకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు, కోశాధికారి నాగమణి, ఉపాధ్యక్షుడు రామాంజినేయులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక..
పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా గోపాల్, అధ్యక్షుడిగా మధు, ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్, కోశాధికారిగా నూర్‌బాషా, ఉపాధ్యక్షుడిగా వీరాంజి, ఎర్రినాగప్ప, స్వామి, నాగభూషణ, ఆది, కుళ్లాయమ్మ, సహాయ కార్యదర్శులుగా బాలాజీనాయక్, రామకృష్ణ, పెద్దన్న, నల్లప్ప, సంధ్యాబాయితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.


