ఉద్యమం ఉధృతం
సమస్యలు
పరిష్కరించకుంటే..
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని, కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని, తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు నాగేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి రమాదేవి, కోశాధికారి కాత్యాయిని మాట్లాడారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన మినిట్స్ నేటికీ అమలు కాలేదన్నారు. అర్హులైన ఆయాలకు పదోన్నతి కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అన్ని యాప్‌లూ కలిపి ఒక యాప్‌గా మార్పు చేయాలని, 5జీ ఫోన్ ఇవ్వాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలన్నారు. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.


