నేడు జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమరావు తెలిపారు. శుక్రవారం ఆయన అనంతపురంలో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహన ప్రమాదభరిత కేసులు, సివిల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు (విడాకుల కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, పంచాయతీ ట్యాక్స్ కేసులు, మున్సిపల్ ట్యాక్స్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేయనున్నట్లు వెల్లడించారు.
‘సత్య’ మార్గమే
భవితకు సోపానం
ప్రశాంతి నిలయం: సత్యసాయి ప్రబోధించిన సత్య, ధర్మ మార్గాలను అనుసరించడం వల్ల జీవితం బంగారుమయం అవుతుందన్న సందేశాన్నిస్తూ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన భక్తులను మురిపించింది. పర్తియాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్–9 దేశాల భక్తులు శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ‘ట్రూత్ రైట్యూస్‌నెస్ అండ్ ది గోల్డెన్ ఇల్యూషన్’ పేరుతో మారిషస్ భక్తులు నాటిక ప్రదర్శించారు.
వైఎస్సార్‌సీపీ కమిటీల్లో చోటు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ కమిటీల్లో పలువురికి చోటు లభించింది. రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రెటరీలుగా గుంతకల్లుకు చెందిన జి.చిన్నరాయుడు, కళ్యాణదుర్గానికి చెందిన గుర్రం లింగప్ప, జాయింట్ సెక్రెటరీగా గుంతకల్లుకు చెందిన కందుల వినోద్ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఐటీ వింగ్ జిల్లా ఉపాధ్యక్షునిగా కళ్యాణదుర్గానికి చెందిన వాల్మీకి మంజునాథ్, కార్యదర్శిగా ఎన్.బాబు, కణేకల్లు మండల సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్‌గా రాయదుర్గానికి చెందిన కేపీ శివయ్య, గుమ్మఘట్ట ప్రెసిడెంట్‌గా కాపు హనుమంతరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా
డాక్టర్ మల్లీశ్వరి
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె నంద్యాల సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్నారు. బదిలీపై అనంతపురం సర్వజనాస్పత్రికి రానున్నారు. కాగా ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ఆయన అనస్తీషియా విభాగంలో ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు.
ఎంఎస్‌పీతో
కందుల కొనుగోలు
అనంతపురం సెంట్రల్: ఖరీఫ్‌లో రైతులు పండించిన కందులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటాలు రూ. 8వేల ప్రకారం ఆర్‌ఎస్‌కే వేదికగా త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ క్రాప్ చేసుకున్న రైతులు ఆర్‌ఎస్‌కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
17 షీప్ సొసైటీల్లో
ఆగిన ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో రెండో విడతగా శుక్రవారం 29 షీప్ సొసైటీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయగా.. వివిధ కారణాలతో 17 సొసైటీల్లో ఎన్నికలు ఆగిపోయినట్లు పశుసంవర్థకశాఖ అధికారులు తెలిపారు. 12 సొసైటీల్లో ఎన్నికలు జరిగినట్లు వెల్లడించారు. ఈ నెల 5న తొలి విడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా అందులో 18 సొసైటీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం మీద రెండు విడతల్లో 84 సొసైటీలకు గాను 35 సొసైటీల్లో ఎన్నికలు నిలిచిపోయినట్లు వెల్లడించారు.
నేడు జాతీయ లోక్ అదాలత్


