అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అనంతపురం అర్బన్: ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మార్చిలోగా పనులు పూర్తవ్వకపోతే నిధులు వెనక్కు పోతాయన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, సమగ్రశిక్ష, మైనర్ ఇరిగేషన్, తదితర శాఖల ఇంజినీరింగ్ సెక్టార్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం మార్చి నాటికి పూరి చేయాలని ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద మంజూరైన పనులనూ చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, పీఆర్ ఎస్‌ఈ సుబ్బారాయుడు, ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, హెచ్ ఎల్‌సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు, ఆయా శాఖల ఈఈలు పాల్గొన్నారు.
బ్యాంకర్ల తీరుపై అసంతృప్తి
అనంతపురం అర్బన్: పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో బ్యాంకర్ల తీరు సరిగాలేదని కలెక్టర్ ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్‌బీఐ అధికారి రోహిత్ అగర్వాల్‌తో కలిసి జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం ముద్ర యోజన, సూర్యఘర్ యోజన, పీఎంఈజీపీ, తదితర పథకాలకు సంబంధించి రుణాల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. పలువురు బ్యాంకర్లు తమ లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతి సంతృప్తికరంగా లేదన్నారు. సిటీ యూనియన్, బంధన్, కోటక్ మహీంద్ర తదితర బ్యాంకులు పీఎం ముద్ర యోజన రుణాలు మంజూరు చేయలేదన్నారు. పురోగతి చూపకపోతే జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి సహకారమూ అందిచబోమని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. సమావేశానికి రాని బ్యాంకర్లకు మెమో ఇవ్వాలని చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక బ్యాంక్ బ్రాంచ్, ఏటీఎం ఏర్పాటు చేయాలన్నారు. డిమాండ్ ఉండి బ్యాంకులు లేని మరూరు, నెలగొండ, సంతేకొండాపురం, తదితర గ్రామాల్లో నూతన బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పీఎం సూర్య ఘర్ యోజన రుణాలకు సిబిల్ స్కోర్‌తో ముడిపెట్టరాదన్నారు. అలా ఏదైనా బ్యాంక్ చెబితే ఎస్‌ఎల్‌బీసీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. పీఎంఈజీపీ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రుణాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, నాబార్డు ఏజీఎం అనురాధ, ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్, ఎడీపీసీ బ్యాంక్ సీఈఓ సురేఖరాణి, పరిశ్రమల శాఖ జెడ్‌ఎం శ్రీనివాసరావు, మెప్మా పీడీ విశ్వజ్యోతి, రూడ్‌సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


