అవమానపరిచాడని అంతమొందించాడు!
గుంతకల్లు: మంచి నీటి కొళాయి వద్ద జరిగిన ఘర్షణలో వ్యక్తిని దారుణంగా నరికి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు వివరాలను వన్‌టౌన్ సీఐ మనోహర్ శనివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. పాత గుంతకల్లులోని అంకాళమ్మగుడి సమీపంలో కురుబ చంద్రశేఖర్, శివకుమార్ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. చంద్రశేఖర్, పుష్పావతి దంపతులకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయినా పిల్లలు కలగలేదు. దీంతో శివకుమార్ కన్ను పుష్పావతిపై పడింది. చంద్రశేఖర్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి తలుపులు కొడుతూ ఉండేవాడు. విసిగిపోయిన పుష్పావతి విషయాన్ని భర్త చంద్రశేఖర్‌కు చెప్పడంతో శివకుమార్‌తో పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలోనే బంధువులు, చుట్టుపక్కల వారి ఎదుట శివకుమార్‌ను చంద్రశేఖర్ అవమానపరిచాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన శివకుమార్ ఎలాగైనా చంద్రశేఖర్‌ను తుద ముట్టించాలని భావించాడు. శనివారం ఉదయం మంచి నీటి కొళాయి వద్ద చంద్ర, పుష్పావతి ఇరువురు కలిసి నీళ్లు పట్టుకుంటుండగా శివ గొడవకు దిగాడు. ఈ క్రమంలో పుష్పావతి గతంలో శివకుమార్ తలుపులు కొట్టిన విషయాన్ని మరలా ప్రస్తావించడంతో ఆగ్రహం చెందిన శివకుమార్ ‘నన్ను ప్రతి సారీ అవమానపరుస్తున్నారు. ఈ రోజు వదిలిపెట్టేది లేదు’ అంటూ ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకువచ్చి చంద్రశేఖర్ మెడపై నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. శివకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. శివకుమార్ శనివారం వేరే ఊరికి వెళ్లేందుకు పట్టణంలోని హనుమన్ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్యకు వాడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.
గుంతకల్లు చంద్ర హత్య కేసులో
నిందితుడి అరెస్ట్


