చెరువు మట్టి.. కొల్లగొట్టి
రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని హంపాపురం చెరువులో మట్టి (జీడ)పై కన్నేశాడు అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు. సహజవనరును ఇక్కడి నుంచి అనంతపురం నగరం చుట్టుపక్కల ఉన్న ఇటుక పెల్లల తయారీ కేంద్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో అంటకాగుతున్న ఈ వ్యక్తి చెరువు జీడను అక్రమంగా తరలిస్తుండడంపై రైతులు, గ్రామస్తులతో పాటు గ్రామంలోని టీడీపీకే చెందిన వారు సైతం మండిపడుతుండడం గమనార్హం.
24 గంటలూ తవ్వుడే.. తవ్వుడు..
ప్రారంభంలో జేసీబీతో చెరువులో జీడను తవ్విన సదరు నాయకుడు...ఇప్పుడు ఏకంగా రెండు ఇటాచీలు పెట్టి మరీ తోడేస్తున్నాడు. టిప్పర్లతో 24 గంటలూ తరలిస్తున్నాడు. ఒక్కో ట్రిప్పు రూ. 10 వేల దాకా ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన రోజూ లక్షలాది రూపాయలు అప్పనంగా దోచుకుంటున్నాడు.
ఆందోళనలో రైతులు, గ్రామస్తులు..
చోటా నేత నిర్వాకం కారణంగా చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో మట్టిని తరలించడంతో సమీపంలో సాగు చేసిన చీనీచెట్లలో జవుకు పెరిగి ౖరైతులకు తీవ్ర నష్టం కల్గిస్తోందని వాపోతున్నారు. చెరువులో గుంతలు ఏర్పడి కట్టనాణ్యత సైతం లోపిస్తోందని, పొరబాటున తెగితేఎస్సీ కాలనీపై తీవ్ర ప్రభావం చూపుతుందని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేష్టలుడిగి చూస్తున్న అధికారులు..
రోజూ చెరువు జీడ లోడుతో టిప్పర్లు అనంతపురం వెళ్తున్నా అధికారులు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు. విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు తప్పితే కనీస చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. 24 గంటలూ రాప్తాడు పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం సమీపం నుంచే ఈ వాహనాలు వెళ్తుండడం విశేషం. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు ఫోన్లు చేసినా స్పందించడం లేదని చెబుతున్నారు. కలెక్టర్ అయినా స్పందించి హంపాపురం చెరువు నుంచి జీడ తరలించ కుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
‘తమ్ముడి’ బరితెగింపు
హంపాపురం చెరువు నుంచి
అక్రమంగా మట్టి తరలింపు
నిత్యం రూ.లక్ష విలువైన మట్టి
ఇటుక బట్టీలకు విక్రయం
‘పచ్చ’ నాయకుడి నిర్వాకంతో
చెరువులో పెద్దపెద్ద గుంతలు
చేష్టలుడిగి చూస్తున్న విజిలెన్స్,
పోలీసు, రెవెన్యూ అధికారులు
చెరువు మట్టి.. కొల్లగొట్టి


