సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుందాం
రాయదుర్గంటౌన్: హిందూ ధర్మం గొప్పతనం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అఖిలభారత ధర్మజాగరణ ప్రముఖ్ శ్యాంకుమార్, ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి శ్రీకరిబసవరాజేంద్ర మహాస్వామి అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో శనివారం సాయంత్రం హిందూ ధర్మ సమ్మేళన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో అన్ని ధర్మాల కన్నా ముందు హిందూ ధర్మం పుట్టిందన్నారు. హిందువులు ధర్మ కర్తవ్యం తీసుకోవాలని, ధర్మ యుద్ధం చేసే సమయం ఆసన్నమైందన్నారు. దేశ స్వాతంత్య్రం సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో విలువైన భూభాగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఆక్రమిత కశ్మీర్ ఉగ్రవాదులకు నిలయంగా మారడానికి కాంగ్రెస్ కారణమన్నారు. వందేళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో స్వయం సేవకులు దేశభక్తితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశంలో మతమార్పిడులు ఆపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, మాజీ మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు బీసా శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు.


