బీజేపీ, జనసేన నేతలకు అవమానం
● లోకేష్ సమావేశంలో వేదికపై దక్కని చోటు
కళ్యాణదుర్గం: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ శుక్రవారం కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో నిర్వహించిన సమావేశంలో కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల నేతలకు చోటు దక్కలేదు. ఇక సొంతపార్టీ టీడీపీలో సీనియర్లకు సైతం వేదికపై చోటు దక్కకపోవడంతో అసంతృప్తితో వెనుదిరిగారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం స్టేజీపై స్థానిక సీనియర్ నేతలతో పాటు బీజేపీ, జనసేన నాయకులకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే సమావేశం ప్రారంభమయ్యే సమయానికి కేవలం మంత్రి లోకేష్, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు ఆశీనులయ్యారు. కూటమిలోని బీజేపీ నేత ముప్పూరి దేవరాజ్, జనసేన నేత రాజేష్‌ను సైతం దూరం పెట్టారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు వస్తుంటే కర్ణాటక షేక్ అవుతోందన్నారు. కర్ణాటక మంత్రి తనపై సైటెర్లు వేస్తున్నారన్నారు. ఏపీ ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అయినప్పటికీ పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు సక్రమంగా అందిస్తున్నామని తెలిపారు. పార్టీలో ఎవరైనా అలకబూనితే ‘డోలో 650’ వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. లోకేష్ ప్రసంగం ఆద్యంతం టీడీపీ సత్తాతోనే ఎన్నికల్లో నిలిచి గెలిచినట్లుగా సాగింది. అనంతరం తన మామ బాలయ్యకు జై అంటూ కార్యకర్తలతో జై కొట్టించారు.
ఎస్‌ఐఆర్‌పై సిబ్బందికి 14న శిక్షణ
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌పై ఈ నెల 14న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి వివేక్‌యాదవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్‌లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లకు 14వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
మార్కెట్లు డీలా...
అనంతపురం అగ్రికల్చర్: వివిధ రకాల ఫీజు వసూళ్లలో మార్కెట్ యార్డ్ కమిటీలు డీలా పడ్డాయి. అనంతపురం, ఉరవకొండ మార్కెట్ యార్డుల పరిస్థితి మెరుగ్గానే ఉన్నా... మిగిలిన శింగనమల, గుత్తి, గుంతకల్లు, రాప్తాడు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి మార్కెట్ కమిటీల్లో వసూళ్లు బాగా తగ్గాయి. జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, వాటి పరిధిలో ఉన్న 15 చెక్‌పోస్టుల ద్వారా ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల ఫీజులు, అద్దెలు, సంతల ద్వారా రూ.13.49 కోట్లు వసూలు చేయాలని దిశానిర్ధేశనం చేశారు. అయితే అక్టోబర్‌తో ముగిసిన ఏడు నెలల కాలానికి 45 శాతం వసూళ్లతో రూ.6.19 కోట్లు వసూళ్లయ్యాయి. ఇందులో రూ.2.84 కోట్లు అనంతపురం మార్కెట్ కమిటీ నుంచి వసూలు కాగా మిగిలిన 8 కమిటీల ద్వారా కేవలం రూ.3.35 కోట్లు వసూలు కావడం విశేషం. అనంతపురం టార్గెట్ రూ.5.10 కోట్లు కాగా ఇప్పటికే 55.76 శాతంతో రూ.2.84 కోట్లు సాధించారు. అలాగే ఉరవకొండ టార్గెట్ రూ.90 లక్షలు కాగా 65 శాతంతో రూ.58.50 లక్షలు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో గుత్తి రూ.25 లక్షలకు గానూ రూ.11.58 లక్షలు సాధించింది. ఇక శింగనమల రూ.1.20 కోట్లకు గాను రూ.54.05 లక్షలతో నాలుగో స్థానంలో ఉంది. కళ్యాణదుర్గం 29.43 శాతం, గుంతకల్లు 33.70 శాతం, రాప్తాడు 34.40 శాతం, రాయదుర్గం 35.34 శాతం, తాడిపత్రి 36.61 శాతం వసూళ్లతో బాగా వెనుకబడ్డాయి. లక్ష్యసాధన దిశగా నడిపించడంలో ఆర్జేడీ, డీడీ, ఏడీఎంలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ, జనసేన నేతలకు అవమానం


