కలుపు మందుతో పంటకు దెబ్బ
● పట్టలు వాడితే మంచిది
● రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్తల బృందం
గార్లదిన్నె: చీనీలో కలుపు నివారణ కోసం విపరీతంగా మందులు వాడితే పంట దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చీనీ తోటల స్థితిగతులు, రైతుల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అనుబంధంగా నాగపూర్‌లోని చీనీ, నిమ్మ పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు సీనియర్ సైంటిస్ట్ ఏకే దాస్, ఎంటమాలాజీ శాస్త్రవేత్త నవీన్ శుక్రవారం ముకుందాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోలిక్ ఆదేశాల ప్రకారం క్లీన్ ప్లాంట్స్, వైరస్ రహిత మొక్కలను రైతులకు అందుబాటులో తీసుకువచ్చేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇక్కడి చీనీ పంటల ఆకులను సేకరించి నాగపూర్ రిజిస్ట్రేషన్ ల్యాబ్‌కు పంపించామన్నారు. అలాగే రైతులు పంటలో కలుపు నివారణ కోసం మందులు విపరీతంగా వాడటం వల్ల తోటలు దెబ్బతింటున్నాయని గుర్తించామన్నారు. కలుపు నివారణ కోసం పట్టలు వాడితే సరిపోతుందన్నారు. చీనీ సాగులో రంగపూర్ అంట్ల మొక్కలు మాత్రమే నాటడం వల్ల, చీడ, పీడలు తక్కువగా ఉంటాయన్నారు. అనంతరం రైతుల సమక్షంలో కలుపు నివారణ పట్టలు చీనీ చెట్లకు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్, గ్రామ రైతులు నారపరెడ్డి, పరంధామ, రామ్మోహన్‌రెడ్డి, పరమేష్‌రెడ్డి, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


