ఉరుకులు.. పరుగులు!
పట్టాలు తప్పిన ప్యాసింజర్
సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్‌ఫీఎఫ్ బృందాలు
మూడు గంటల హడావుడి తర్వాత ‘మాక్‌డ్రిల్’గా ప్రకటన
గుంతకల్లు: తిమ్మనచర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం ఉదయం 8.40 గంటల సమయంలో సైరన్ మోగింది. ఇంతలో లింగంపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది’ అంటూ మైక్‌లో అనౌన్స్‌మెంట్. అంతే క్షణాల్లో అక్కడకు యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్‌తోపాటు 108 అంబులెన్స్‌లు, ఫైరింజన్‌లు వచ్చేశాయి. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, సివిల్ పోలీసులతోపాటు ఆపరేటింగ్, సేఫ్టీ, ఇంజినీరింగ్, కమర్షియల్, మెడికల్ ఇలా అన్ని విభాగాల ఉన్నతాధికారులు, ఎస్‌సీసీ కేడెట్లు ఉరుకులు, పరుగులతో చేరుకున్నారు. బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులు వచ్చారు.
ఇక జనరేటర్లు, స్ట్రెచర్లు, మెడిసిన్స్ వివిధ రకాలు వస్తువులు, కట్ చేసే పరికరాలు, ఇతర్రత సామగ్రితో సిబ్బంది వాలిపోయారు. పట్టాలు తప్పిన బోగీల్లో మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అప్రమత్తమయ్యారు. బోగీ కిటికీలు కట్ చేసి క్షతగాత్రులను స్ట్రెచర్‌పై బయటకు తీసుకురావడం.. అక్కడికక్కడే సీపీఆర్ చేసి స్పృహలోకి తెప్పించడం.. అంబులెన్సుల్లో ఆస్పత్రికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తుండడం.. ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడం.. మూడుగంటలపాటు శ్రమించి ప్రయాణికులను రక్షించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా చూస్తున్న వారికి ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ పూర్తవగానే డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా ఇది ‘మాక్ డ్రిల్’ అని ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఆర్‌ఎంతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండ్ అఖిలేష్ కుమార్ చౌబే, జోనల్ సీఈఎన్‌హెచ్‌ఎం శ్రీనివాస్‌లు మాట్లాడారు. ప్రమాద సమయాల్లో అధికారులు, సిబ్బంది ఏ విధమైన పని తీరు కనబరచాలనే విషయాన్ని తెలుసుకునేందకు ఏడాదికొకసారి ఈ విధమైన కృతిమ ప్రమాదాన్ని సృష్టించి ‘మాక్ డ్రిల్’ నిర్వహిస్తామన్నారు. మాక్ డ్రిల్ ఆపరేషన్‌ను విజయవంతంగా ప్రదర్శించినందుకు సిబ్బంది, అధికారులను వారు అభినందించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ సీఈఎన్‌హెచ్‌ఎం శ్రీనివాస్, సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్, సీనియర్ డీసీఎం ఎన్.మనోజ్, డీసీఎం శ్రీకాంత్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉరుకులు.. పరుగులు!


