కబ్జా కోట గోడ
అనంతపురం క్రైం: అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73లో వంక పొరంబోకు స్థలం ఉంది. గతంలో 200 అడుగుల మేర పొలాల్లోని నీరు ఇటు ప్రవహించేది. నగరం విస్తరించడంతో ఈ వంక రెండు మీటర్లకు కుంచించుకుపోయింది. రహదారి 40 అడుగుల మేర వేయడం, మిగిలిన స్థలాన్ని స్థానిక పరిశ్రమకు చెందిన వ్యక్తులు కొంతభాగం కాజేయడంతో ఇంకా 60 సెంట్లు ఖాళీగా ఉంది. ఈ వంక పొరంబోకుకు ఆనుకుని ఉన్న జనశక్తినగర్ వాసులు తాగునీటి ట్యాంకు కోసమని స్థలం కేటాయించుకున్నారు. ఇప్పుడా స్థలంపై కబ్జాదారుల కళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక హత్యకేసు నిందితులను రంగంలోకి దింపారు. 60 సెంట్లలో 27 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్‌వాల్ కట్టేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ రూ.కోట్లు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.
నగర పాలక సంస్థకు సంబంధం లేదట
కబ్జాదారులను ఎదిరించలేకపోయిన జనశక్తినగర్ వాసులు నగర పాలక సంస్థ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు.. ఆ స్థలం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ‘ఈ స్థలం పక్కన రెండు మీటర్ల దూరంలోనే కాలువ నిర్మించారు. ఒక ఇంటిని నిర్మించుకునేందుకు లేఅవుట్ అప్రూవల్ కూడా ఇచ్చారు. అప్పుడు ఈ భూమి నగర పాలక సంస్థది కాదని ఎందుకు చెప్పలేదు’ అని నిలదీస్తే.. అటువైపు అధికారి ఫోన్ కట్ చేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ పెద్దమనిషితో ఫోన్ చేయిస్తే ‘అటు వెళ్లవద్దని కూటమి పార్టీకి చెందిన ‘అర్బన్’ ప్రజాప్రతినిధి నుంచి మాకు ఆదేశాలున్నాయి’ అంటూ ఆ అధికారి సెలవిచ్చారట. విషయం బయటకు పొక్కకుండా చూడాలని కూడా కోరినట్లు తెలిసింది.
తహసీల్దారూ అదే సమాధానం..
స్థలం కబ్జా చేస్తున్నారంటూ బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ తహసీల్దారు కూడా నగరపాలక సంస్థ అధికారిలానే ‘అది మా పరిధి కాదు’ అంటూ సమాధానమిచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ వ్యవహారంపై మౌనంగా ఉండటం కాలనీవాసులను ఆగ్రహానికి గురి చేస్తోంది. హత్యకేసులో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వారు కబ్జాలకు తెగబడుతుంటే పోలీసులు, రెవెన్యూ, నగర పాలక అధికారులు పట్టించుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. వారినలాగే వదిలేస్తే తమకు రక్షణ ఎక్కడుంటుందని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా అసాంఘిక శక్తుల ద్వారా దందాలకు దిగడం సరైనది కాదని హితవు పలుకుతున్నారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి కాలనీ అవసరాల కోసం ఉంచుకున్న వంక పొరంబోకు స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.
కత్తులు పట్టిన చేతులవి.. ఇప్పుడు కూటమి నేత పంచన చేరి కోట్లు విలువ చేసే భూముల్లో పట్టపగలే పాగా వేశాయి. వెయ్యి కుటుంబాల తాగునీటి అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశాయి. ఏకంగా 8 అడుగుల ఎత్తుతో 300 అడుగుల మేర ప్రహరీ నిర్మిచాయి. ఎదిరించే ధైర్యం లేని స్థానికులు.. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదు. పైపెచ్చు అటువైపు వెళ్లకండని ‘అర్బన్’ పజాప్రతినిధి చెప్పడంతో అధికారులు మిన్నకుండిపోయారని జనశక్తి నగర్ వాసులు వాపోతున్నారు.
కాలనీ అవసరాల కోసం వదులుకున్న స్థలం దురాక్రమణ
ఆ పొరంబోకు స్థలంపై అసాంఘిక శక్తుల కన్ను
27 సెంట్లు ఆక్రమించి దర్జాగా ప్రహరీ నిర్మాణం
‘అటువైపు వెళ్లకండ’ని కూటమి ప్రజాప్రతినిధి ఆదేశం
మిన్నకుండిపోయిన రెవెన్యూ, నగరపాలక యంత్రాంగం


