
టమాట.. నష్టాల బాట
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో 19 వేల హెక్టార్లలో రైతులు టమాట పండిస్తున్నారు. ఇందులో అనంతపురం జిల్లాలో 12 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 7 వేల హెక్టార్లు ఉన్నాయి. 7 లక్షల టన్నుల దిగుబడితో అన్నమయ్య తర్వాతి స్థానంలో అనంత జిల్లా ఉండడం గమనార్హం. ఎకరాకు 14 నుంచి 18 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. కట్టెలు, తీగలు కట్టిన టమాట పంటలో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వస్తుండగా... మామూలు పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. కిలో రూ.22 నుంచి రూ.25 పలికితే పెట్టుబడి పోయి కొంత వరకు మిగులుతుందని అంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో కూలీలు, రవాణా ఖర్చులు, మార్కెట్‌లో కమీషన్లకు కూడా రాబడి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆరంభంలో ఊరించి..
సీజన్ ఆరంభం జూన్, జూలై, ఆగస్టులో మార్కెట్‌లో టమాట ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్‌లో మార్కెట్ పరిస్థితి తారుమారు అయింది. ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్‌టో 15 కిలోల బాక్సు ధర గరిష్టంగా రూ.270 ఉండగా కనిష్టం రూ.130 ప్రకారం పలుకుతోంది. సగటున రూ.200తో క్రయవిక్రయాలు సాగుతున్నాయి. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకు మాత్రమే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100 నుంచి రూ.200 మధ్య పలుకుతుండడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రోజూ మార్కెట్‌కు 2 వేల నుంచి 3 వేల టన్నుల వరకు సరుకు వస్తోంది.
అంతటా ఇదే పరిస్థితి!
మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చు మిగులుతుందనే ఉద్దేశంతో టమాట కోతలకు స్వస్తి పలికారు. దీంతో పొలాల్లోనే పంటను పశువులకు వదిలేశారు. ఇప్పటికే 60 శాతం పంట పూర్తి కాగా, మరో 40 శాతం మేర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు తడిసినవి, మచ్చ ఉన్న కాయలను కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. టమాట సాగులో అన్నమయ్య తర్వాత రెండో స్థానంలో ‘అనంత’ ఉండగా ఆ తర్వాత చిత్తూరు, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. కాగా, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లా పరిధిలోని టమాట మార్కెట్లలో ధరల పరిస్థితి కూడా ఇలాగే ఉందని రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు.
నెలన్నర రోజులుగా రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు
కిలో రూ.15 లోపు పలుకుతుండటంతో దక్కని పెట్టుబడి