
పేదలపై భారం
రేషన్ కోసం చౌక దుకాణం వద్ద క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్)
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం కనుమరుగవుతోంది. రేషన్‌లో ‘కోత’ కొనసాగుతోంది. కార్డుదారులకు సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ నిలివేశారు. కాదు కాదు.. ఎగనామం పెట్టారు! పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన జొన్నలు, రాగుల పంపిణీకి తాజాగా కూటమి సర్కారు మంగళం పాడింది. గత నెల వరకు జొన్నలను అరకొరగా స్టోర్లకు సరఫరా చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. అక్టోబరుకు సంబంధించి చౌక దుకాణాలకు జొన్నలు, రాగుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు కిలో కందిపప్పు చొప్పున నెలసరి కోటా 615 టన్నులు, అదే విధంగా జొన్నలు 1,100 టన్నులు, రాగులు 1,100 టన్నులు కేటాయించాల్సి ఉన్నా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ చేయడం లేదు. మూడు నెలలుగా అరకొరగా జొన్నలు పంపిణీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం నేడు పూర్తిగా ఎగనామం పెట్టేసింది. అదే బాటలో రాగుల పంపిణీని కూడా నిలిపివేసింది.
ఇచ్చిందీ గతంలో కొనుగోలు చేసినవే..!
కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు కిలో రూ.67తో అందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు కొత్తగా కందిపప్పు కొనుగోలు చేసేందే లేదు. గత ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసిన స్టాక్ ఉన్నంత వరకే కందిపప్పును పంపిణీ చేయడం గమనార్హం.
ఏడు నెలలుగా అదే మాట..
రేషన్ కోతపై అధికారులు చెప్పే కారణాలు వింటే విస్తుపోవాల్సిందే. కందిపప్పు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ ఇంకా టెండర్ దశలో ఉందని ఏడు నెలలుగా చెబుతుండడం చూస్తే సార్లూ ‘ఏమి సెప్తిరి’ అని ఎవరికైనా అనిపించకపోదు. జొన్నలు, రాగుల విషయానికి వస్తే స్టాక్ అయితే ఉందట.. కాకపోతే ఆన్‌లైన్‌లో సమస్య కారణంగా స్టోర్లకు సరఫరా చేయలేకున్నామని చెప్పడం గమనార్హం.
కోతలు... వాతలు కనిపించవా?
గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా నాణ్యమైన కందిపప్పు, జొన్నలు, రాగులు పంపిణీ చేశారు. అయినా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేశారు. ఆ ‘పచ్చ’ కళ్లకు నేడు కోతలు.. వాతలు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.
కొనసాగుతున్న కూటమి కోతలు
మొదట కందిపప్పు దూరం
తాజాగా జొన్నలు, రాగుల
పంపిణీకి మంగళం
బియ్యం, చక్కెరతోనే సరి
పేదలపై మోయలేని భారం
కందిపప్పు, జొన్నలు, రాగులను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పేదలు బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి కుటుంబం నెలకు ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు వినియోగిస్తారు. ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67, జొన్నలు, రాగులు మూడు కిలోలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.130, జొన్నలు రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు, రాగులు కిలో రూ.50 వరకు పలుకుతున్నాయి. సర్కారు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కిలో కంది పప్పుపై రూ.73 అదనంగా, మూడు కిలోల జొన్నలకు రూ.120 నుంచి రూ.180, రాగులకు కిలో రూ.50 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది.

పేదలపై భారం