
‘రబీ’ వచ్చేసింది
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి మొదలైన ఖరీఫ్ సీజన్ ముగిసింది. బుధవారం నుంచి రబీ సీజన్ మొదలు కానుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ‘రబీ’గా పరిగణిస్తారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి చలికాలం, మార్చి నుంచి వేసవి మొదలవుతుంది. ఖరీఫ్‌లో 2.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న, ఆముదం తదితర ప్రధాన పంటలు సాగులోకి వచ్చాయి. రబీలో జిల్లాలో ప్రధాన పంటగా పప్పుశనగ 70 వేల హెక్టార్లకు పైబడి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అంచనా వేశారు. అందులో ప్రధానంగా పప్పుశనగతో పాటు వేరుశనగ 20 వేల హెక్టార్లు, మిగతా అన్ని పంటలు కలిపి మరో 30 వేల హెక్టార్ల వరకు సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. రబీ సీజన్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం 139.3 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. అందులో అక్టోబర్‌లోనే అత్యధికంగా 100.9 మి.మీ, నవంబర్‌లో 28.6 మి.మీ, డిసెంబర్‌లో 9.8 మి.మీ నమోదు కావాలి.
ముందస్తు సాగుకు సిద్ధం..
ఖరీఫ్‌కు సంబంధించి జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో రబీలో ముందస్తు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. నల్లరేగడి భూముల్లో పప్పుశనగతో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు విత్తుకునేందుకు విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డీ.హిరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంత కల్లు మండలాల్లో విత్తన పంపిణీ చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు పప్పశనగ సాగుకు మంచి అదనుగా చెబుతున్నా... వర్షాలు వస్తే ముందుగానే సాగుకు రైతులు రెడీగా ఉన్నారు. కానీ కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు. గతేడాది 27,129 క్వింటాళ్ల విత్తన పప్పుశనగ కేటాయించగా... ఈ సారి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఖరీఫ్‌లో పంపిణీ చేసిన వేరుశనగ, పప్పుశనగ, కందులు, విత్తన వరి తదితర వాటికి సంబంధించి కూటమి సర్కారు ఏపీ సీడ్స్ ద్వారా ఏజెన్సీలకు బకాయిలు చెల్లించలేదు. దీంతో విత్తన సేకరణ, సరఫరా, పంపిణీ ఈ సారి జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే ఏఓలు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు నాన్‌సబ్సిడీ కింద రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము పూర్తి స్థాయిలో ఏపీ సీడ్స్‌కు చెల్లించకపోవడం కూడా సమస్యగా మారిందని చెబుతున్నారు. ఇక.. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రబీ కింద నీటి వసతి సదుపాయం కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ సాగుకు వీలుగా రాయితీ విత్తన పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీజన్‌లో 1.20 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా
ప్రధాన పంటగా 70 వేల హెక్టార్లలో పప్పుశనగ
ఈశాన్యంతో 139.3 మి.మీ సాధారణ వర్షపాతం!