
ధర్మవరం వరకు ‘సూపర్ ఫాస్ట్’ పొడిగింపు
● సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం
కదిరి: గుంటూరు – తిరుపతి మధ్య నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (17261)ను ధర్మవరం వరకూ పొడిగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి (నవంబర్ 23)ని పురస్కరించుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అంటే రెండు నెలల పాటు ఈ రైలు ధర్మవరం వరకు నడుపుతారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే తిరుపతి వరకూ వచ్చి ఆగిపోతుంది. రోజూ సాయంత్రం 4.30 గంటలకు రైలు గుంటూరులో బయలుదేరుతుంది. నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, రాజంపేట మీదుగా ప్రయా ణించి తెల్లవారుజామున 3.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి 4.05 గంటలకు బయలుదేరి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, మొలకలచెరువు, కదిరి మీదుగా ఉదయం 9 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరంలో మధ్యాహ్నం 1.20కి బయలు దేరి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7.15కు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ 10 నిమిషాలు మాత్రమే ఆగి.. తర్వాత బయలుదేరి మరుసటి దినం ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు నెలల పాటు రోజూ ఒక రైలు (17261) గుంటూరు లో సాయంత్రం 4.30కు బయలుదేరితే, ఇంకో రైలు (17262) ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరేలా రైల్వేశాఖ నిర్ణయించింది.