
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 1న 0.4 మి.మీ, 2న 0.2 మి.మీ, 3న 2.4 మి.మీ, 4న 5.5 మి.మీ, 5న 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీల నుంచి 32.7 డిగ్రీలు, రాత్రిళ్లు 22.8 డిగ్రీల నుంచి 23.2 డిగ్రీల మధ్య ఉండొచ్చన్నారు.
గొర్రె పిల్లలను
మింగిన కొండచిలువ
పుట్టపర్తి అర్బన్: మందలో ఉన్న రెండు చిన్న గొర్రె పిల్లలను కొండ చిలువ మింగింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సమీపంలోని కొండ నుంచి వచ్చిన భారీ కొండ చిలువ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విజయ్ మందలోకి చొరబడింది. ఒక పిల్లను మింగేసింది. రెండవ పిల్లను నోట కరుచుకోవడంతో అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన విజయ్ తోటి కాపరుల సహకారంతో రెండవ పిల్లను కొండ చిలువ నోటి నుంచి లాగేశారు. అప్పటికే అది మృతి చెందింది. కొండచిలువ ఎటూ వెళ్లలేక మందలోనే ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బుక్కపట్నం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు.
పీహెచ్‌సీలకు 54 మంది వైద్యుల కేటాయింపు
అనంతపురం మెడికల్: జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు 54 మంది వైద్యులను కేటాయించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పీహెచ్‌సీల డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఆయా పీహెచ్‌సీలకు వైద్యులను సర్దుబాటు చేశారు. ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 26 మంది వైద్యులను పంపినట్లు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. 104,108 సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
చింతలరాయుడి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తాడిపత్రి రూరల్: పట్టణంలో భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకట రమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విశ్వక్సేన సేవ జరిగింది. ఆలయం చుట్టూ విశ్వక్సేనుల ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయం విద్యుద్దీపాలంకరణల నడుమ కొత్త శోభ సంతరించుకుంది.
రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి : జేసీ
అనంతపురం అర్బన్: కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లను జేసీ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చౌక ధరల దుకాణాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా తమకు దగ్గరలోని ఏ చౌక దుకాణం వద్దనైనా సరుకులు తీసుకోవచ్చన్నారు. సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన