ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే

Oct 1 2025 10:21 AM | Updated on Oct 1 2025 10:21 AM

ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే

ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే

రాప్తాడురూరల్‌: ‘పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం కేవలం రూ. 1.80 లక్షలకే ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ పనులను నిలిపివేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలను నిలుపుదల చేసిన పాపం ఈ ప్రభుత్వానిదే’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురం నగర శివారులోని తన క్యాంపు కార్యాలయంలో ‘డిజిటల్‌ బుక్‌ క్యూ ఆర్‌ కోడ్‌’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్‌ బుక్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జగన్‌ ఇచ్చిన అభయం డిజిటల్‌ బుక్‌ అన్నారు.

మిథున్‌రెడ్డిది అక్రమ అరెస్ట్‌..

ఎంపీ మిథున్‌ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు. 2014–19 మధ్య లిక్కర్‌ అమ్మకాల ద్వారా రూ. 70 వేల కోట్ల ఆదాయం పొందితే, జగన్‌ హయాంలో 2019–24 మధ్య రూ.1.5 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిందని, ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కాం జరిగిందా? లేకుంటే ఆదాయం తగ్గిన చంద్రబాబు హయాంలో స్కాం జరిగిందా ఆలోచించాలన్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికాడో దేశానికే తెలుసని,స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అనారోగ్య సమస్యలపై బెయిల్‌ వచ్చిందనేది అందరికీ తెలుసన్నారు.

విజిలెన్స్‌తో ఏం తేల్చారు?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లోనే జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారని, అయితే ఇప్పటిదాకా ఏమి తేల్చారని ప్రకాష్‌ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం రూరల్‌ మండలంలో ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆపారన్నారు. నేడు ఒక్కో ఇంటిపై అనంతపురం ఎమ్మెల్యే రూ. 10 వేలు, రాప్తాడు ఎమ్మెల్యే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ‘అదేమైనా మీ నాయన గంటా.. లేకుంటే మీ జేజినాయన ముడుపులు ఏమైనా ఇచ్చారా..’ అని ప్రశ్నించారు. అమరావతిలో నాలుగు కంపెనీలకే రూ. వేల కోట్ల పనులు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుక, చివరకు ఇళ్ల నిర్మాణాల నుంచి కూడా డబ్బులు కావాలా అని ప్రశ్నించారు. ఇంత దోచుకుంటున్నా మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రాలేదా అని నిలదీశారు. పేదలకు ఉచిత వైద్యంతో పాటు పిల్లలకు వైద్యవిద్య అందించాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తారా అని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత దేవుడయ్యాడని, కానీ చనిపోయిన తర్వాత పీడ పోయిందబ్బ అనుకునేలా చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గంగుల భానుమతి, అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, రాప్తాడు వైస్‌ ఎంపీపీ రామాంజి, లాయర్‌ నాగిరెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, గోవిందరెడ్డి, బండి పవన్‌, నీరుగంటి నారాయణరెడ్డి, లింగారెడ్డి, సునీల్‌దత్తరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలకృష్ణవి బాధ్యత లేని మాటలు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టవి బాధ్యత లేని మాటలు అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలతో టీడీపీ నేతలకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియడం లేదన్నారు. ‘అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి...కడుపైనా చెయ్యాలి’ అని గతంలో మాట్లాడారన్నారు.‘నువ్వు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రివే.. అయినా అలా ఎలా మాట్లాడావు. గ్లాస్‌ అలా తిప్పి మ్యాన్సన్‌హౌస్‌ మందు తాగితే అమ్మ పెళ్లామవుతుందా...పెళ్లాం అమ్మవుతుందా’ అని నిలదీశారు. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు’ అని మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. తల్లిని అవమానించిన వారి పంచన చేరి పవన్‌కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నారని, నేడు అన్నను అవమానిస్తే మాత్రం నోరు ఎత్తడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారమంతా చిరంజీవి రాసిన లేఖ, మహేష్‌బాబు, నారాయణమూర్తి మాటలతో పటాపంచలయ్యాయన్నారు.

నిరుపేదల నుంచి ఒక్కో ఇంటికి రూ. 10 వేలు వసూలు చేస్తారా?

కూటమి బాధితులకు జగనన్న అభయం ‘డిజిటల్‌ బుక్‌’

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement