
ఐక్యతతోనే బీసీలకు ఫలాలు
● కులగణనతోనే బీసీల అభ్యున్నతి
● మాజీ ఎంపీ తలారి రంగయ్య
అనంతపురం టవర్‌క్లాక్: ఐక్యతతోనే బీసీలకు ఫలాలు అందుతాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, మాజీ మేయర్ రాగే పరుశురామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ బీసీలు అత్యధిక జనాభా ఉన్నా ఎన్నో ఏళ్లుగా వెనుకబడిపోతున్నారన్నారు. హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్ల కోసం అడుక్కోవడానికే పరిమితమయ్యామని, ఇలాగే భయపడుతూ ఉంటే మరింత వెనుకబాటు తప్పదన్నారు. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించి అందరికీ ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో కుల గణన చేయడం ద్వారా బీసీలు అభివృద్ధి చెందారన్నారు. గతంలో తాను మున్సిపల్ కమిషనరుగా ఉన్నప్పుడు కులగణనపై నివేదిక కూడా పంపినట్లు గుర్తు చేశారు. ఇప్పటికై నా బీసీల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు కులగణన చేపడతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీసీల జపం చేసి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేవరకు ఉద్యమాలు కొనసాగించాలన్నారు. ఇందుకు బీసీ ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు బాల రంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, ఇమామ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, బీఎస్పీ నాయకులు గోవిందు, ఆర్‌పీఎస్ నాయకులు శ్రీరాములు. శివబాల, లింగమూర్తి, బోరంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.