
ఎట్టకేలకు ‘సమగ్ర’ సెక్టోరియల్స్ నియామకం
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయానికి సెక్టోరియల్ అధికారుల నియామకం పూర్తయింది. రాజకీయ గ్రహణం, అధికారుల అలసత్వం కారణంగా ఏడాదికిపైగా ఈ పోస్టులు ఖాళీగానే ఉంటూ వచ్చాయి. పర్యవేక్షణ లేక కుంటుపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చి, అందిన దరఖాస్తులను పరిశీలించి సీనియార్టీ జాబితా మేరకు ఇంటర్వ్యూలు చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఎక్కడా సమాచారం బయటపడకుండా ఈ ప్రక్రియ అంతా గోప్యంగా ఉంచారు. నెలన్నర దాటినా నియామక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈనెల 23న ‘అటకెక్కిన విద్యాభివృద్ధి’ శీర్షికన ‘సాక్షి’లో మరో కథనం వెలువడింది. దీంతో రాష్ట్ర అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారులు పంపిన జాబితాకు ఆమోదం తెలుపుతూ ఐదుగురిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేడో, రేపో వీరు విధుల్లో చేరనున్నట్లు సమాచారం.