
రూ.26 కోట్ల వ్యాపార లక్ష్యం సాధించాలి
● డీసీఎంఎస్ మహాజనసభలో చైర్మన్ నెట్టెం వెంకటేశులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పురోభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని సొసైటీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు అన్నారు. సోమవారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణలో మహాజన సభ జరిగింది. డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.24.71 కోట్లు వ్యాపార ప్రగతి సాధించామన్నారు. ఇందులో ప్రధానంగా ఎరువుల పంపిణీ ద్వారానే రూ.22.41 కోట్లకు పైగా సమకూరిందన్నారు. ఈ ఏడాది రూ.26 కోట్లు వ్యాపార ప్రగతిని సాధించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మహాజనసభలో అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సాంకేతికతను రైతులకు చేరువ చేయండి
● ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ శారద
కళ్యాణదుర్గం: నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేసి, వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.శారద సూచించారు. కళ్యాణదుర్గం కేవీకేను సోమవారం ఆమె సందర్శించారు. కేవీకేలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ జాన్సన్, కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ ఈ.చండ్రాయుడు, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.