
గందరగోళం మధ్య చిన్నారి మృతిపై విచారణ
ఉరవకొండ: ఈ నెల 25న ఉరవకొండ సీహెచ్‌సీలో వైద్యం అందక ఐదేళ్ల బాలుడు అహరోన్‌కుమార్ మృతిచెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం చేపట్టిన తీవ్ర గందరగోళం మధ్య సాగింది. కమిటీ సభ్యులు డీసీహెచ్‌ఎస్ డేవిడ్ సెల్వరాజ్, డీఎంహెచ్‌ఓ భ్రమరాంబిక దేవి, సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణుడు డాక్టర్ లోక్‌నాథ్‌ల వేర్వేరుగా బాధ్యులైన వైద్యాధికారి డాక్టర్ ఇస్మాయిల్, స్టాఫ్‌నర్సు ప్రియాంకతో పాటు మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులను విచారణ చేశారు. నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్‌కూ విన్నవించనున్నట్లు సభ్యులు తెలిపారు.
డాక్టర్ చౌదరియే కారణం
చిన్నారి మృతి అంశంపై విచారణ సాగుతుండగానే ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ చౌదరితో జైభీమ్‌పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామప్పనాయక్ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తొలుత బాలుడిని డాక్టర్ చౌదర తన ప్రైవేట్ క్లినిక్‌లో చేర్పించుకుని చికిత్స అందిస్తూ వచ్చారని, ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారంటూ మండిపడ్డారు. డాక్టర్ చౌదరి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ ఆరోపించారు. దీంతో బాధ్యుడైన మరో డాక్టర్ డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. బాలుడి మృతికి తన పొరపాటు లేదని, పరిస్థితి విషమించిన తర్వాతనే ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారంటూ చెప్పబోగా, ఆయనపై బాధిత కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు.