
పాలకుల్లో చలనం రావాలంటే ఉద్యమాలే శరణ్యం
● 7న తలపెట్టిన ‘చలో విజయవాడ – పోరుబాట’ విజయవంతం చేయండి
● ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్సనర్ల సమస్యల పరిష్కారంపై పాలకుల్లో కదలిక రావాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు అన్నారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. పరిశీలకులుగా హాజరైన హృదయరాజు మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో 72, 73, 74 జీఓలు అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. కేంద్ర మెమో 57ను అమలుపరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, సంపాదిత సెలవు బిల్లులు విడుదల చేయాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. డిమాండ్ల సాధనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలో తలపెట్టిన ‘చలో విజయవాడ–పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాసనాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, ఫ్యాప్టో జిల్లా సభ్య సంఘాల నాయకులు వెంకటేష్, రమణారెడ్డి, లింగమూర్తి, ఓబులేసు, లింగమయ్య, వెంకట రత్నం, రామాంజనేయులు, జయరామిరెడ్డి, అక్కులప్ప, రెహ్మాన్, సిరాజుద్దీన్, గోపాల్ రెడ్డి, జార్జ్, కులశేఖర రెడ్డి, వెంకటసుబ్బయ్య, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.