
ఓఎంసీలో అటవీశాఖ అధికారుల తనిఖీలు
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో అటవీశాఖ అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ చక్రపాణి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజర్ రామంచంద్రుడు, డీఆర్‌ఓ దామోదర్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి ఓఎంసీ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 2011లో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం, వాహనాల స్క్రాబ్ వివరాలపై డీఎఫ్‌ఓ ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ సీజ్ చేసిన ఐరన్ ఓర్‌ను కొందరు అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే ఇక్కడ అలాంటిదేమీ కానరాలేదన్నారు. ఒకటి, రెండు ట్రిప్పులు మాత్రమే తరలివెళ్లినట్టు గుర్తించామన్నారు. పెద్ద ఎత్తున దోపిడీ జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. ఓఎంసీ ప్రాంతంలో పటిష్ట నిఘా ఉంచామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ–పంట నమోదు తప్పనిసరి
కళ్యాణదుర్గం రూరల్/రాయదుర్గం టౌన్/ కణేకల్లు: సాగు చేసిన పంటలను రైతులు తప్పని సరిగా నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం డివిజన్ పరిధి లోని మండలాల్లో ఈ– పంట నమోదును పరశీలించారు. ఈ సందర్బంగా ఆమె మట్లాడుతూ రైతుల పొలాల్లోకి వెళ్లి ఏ పంటలైతే సాగు చేశారో వాటి వివరాలే నమోదు చేయాలన్నారు. యూరియాపై రైతులెవరూ ఆందోళన చెందొద్దని, డిమాండ్‌కు సరిపడా యూరియా పంపిణీ చేస్తామన్నారు. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పెండింగ్ రైతుల వివరాలను పూర్తి చేయాలన్నారు. ఆర్‌ఎస్‌కేల సిబ్బంది రైతులతో మమేకమై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఎల్లప్ప, ఏఓ శ్రావణ్ కుమార్, రాణి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.