
కాళ్లరిగేలా తిరుగుతున్నాం సార్
● గోడు వెళ్లబోసుకున్న బాధితులు
● ‘పరిష్కార వేదిక’లో 540 వినతులు
అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పనులు జరగడం లేదని ప్రజలు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ. ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 540 వినతి పత్రాలు అందాయి.
వినతుల్లో కొన్ని...
● భూమికి సంబంధించిన కేసులో అనంతపురం ఆర్‌డీఓ ఏకపక్షంగా వ్యవహరించి తమకు వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చారని అనంతపురం రూరల్ మండలం నరసనాయని కుంటకు చెందిన ఎం.సుధామణి ఫిర్యాదు చేసింది. హైకోర్టులో రిట్ పిటీషన్ వేశామని, ఈ విషయాన్ని ఆర్‌డీఓ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా సోమవారం తమకు వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చారని చెప్పింది. సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కోరింది.
● దారిని మూసి వేసి ఇబ్బంది పెడుతున్నారని గుత్తి మండలం జక్కలచెరువుకు చెందిన కృష్ణ, తదితరులు విన్నవించారు. తాము వైఎస్సార్ సీపీకి చెందిన వారమని వేధిస్తున్నారని వాపోయారు. 32 మంది రైతులకు సంబంధించి 200 ఎకరాలు ఉన్న భూమికి సర్వే నంబరు 91లో ఒకే ఒక రస్తా ఉందని, రస్తా మూసి వేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని, న్యాయం చేయాలని విన్నవించారు.
● వివిధ సర్వే నంబర్లలోని 800 ఎకరాల ప్రభుత్వ భూమి తన పేరిట నమోదైందని కుందుర్పి మండలం బోదపల్లికి చెందిన బొజ్జప్ప ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని కోరాడు.
● తన కష్టార్జితం 13.97 ఎకరాల భూమి తీసుకున్న ఇద్దరు కుమారులులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని, దీనిపై ఆర్‌డీఓ కోర్టులో కేసు వేయగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లికి చెందిన వై.వెంకటరామిరెడ్డి చెప్పాడు. అయితే కుమారులు జేసీ కోర్టులో కేసు వేశారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాడు.
నిర్లక్ష్యానికి తావివ్వొద్దు..
జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ప్రారంభానికి ముందు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫైళ్లను ఈ–ఆఫీస్ ద్వారా నిర్వహించాలన్నారు.