
రైతులను వంచిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: రైతులకు సరిపడా యూరియాను అందించడం చేతకాని కూటమి ప్రభుత్వం తాజాగా యారియాకు రాయితీ అంటూ రైతులను వంచనకు గురి చేసే కుట్రకు తెరతీసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే బస్తాకు రూ.800 రాయితీ ఇస్తామని చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు దండుకుని రైతులకు యూరియా వాడకాన్ని తగ్గించుకోమంటూ సీఎం చంద్రబాబు చెప్పడం పూర్తిగా రైతు వ్యతిరేక చర్యగానే భావించాల్సి వస్తుందన్నారు. పంటల దిగుబడి తగ్గకుండా ఉండేందుకు రైతులకు అవసరమైన మేర ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడడం సిగ్గు చేటన్నారు. ఉన్నతాధికారులు, అధికారపార్టీ నాయకుల అండతో ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు వ్యాపారులు తరలించడం వల్లనే కొరత ఏర్పడిందన్నారు. యారియా వాడకంతో క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఏ వైద్య పరిశోధనా సంస్థ లేదా శాస్త్రవేత్త ఈ విషయం చెప్పారో వెల్లడించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎరువులు సరఫరా చేయలేక క్యాన్సర్ అని చెబుతూ ప్రజలను భయపెట్టడం చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధినే శకించాల్సి వస్తోందన్నారు. ఎరువుల సరఫరాకు ఈ–క్రాప్ నమోదుకు ముడి పెడుతున్న ప్రస్తుత తరుణంలో సాగుదార్ల నమోదు పక్కాగా చేయాలన్నారు. కౌలు రైతులను రికార్డు చేయకుండా లింకేజీ నిబంధన అమలు చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. భవిష్యత్తులో ఎరువులకూ నగదు బదిలీ విధానాన్ని ప్రభుత్వం తెచ్చే ప్రమాదం లేకపోలేదని, ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యూరియాకు రాయితీ అంటూ మభ్యపెడుతోంది
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర రెడ్డి ధ్వజం