వణికిస్తున్న జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న జ్వరాలు

Sep 18 2025 7:06 AM | Updated on Sep 18 2025 1:51 PM

A scene of three children receiving treatment on each bed

అనంతపురం సర్వజనాస్పత్రి చిన్నపిల్లల వార్డులో ఒక్కో మంచంపై ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతున్న దృశ్యం

ప్రతి ఆస్పత్రిలోనూ జ్వరపీడితులే

తాజాగా గుత్తిలో ఇద్దరు చిన్నారులు డెంగీతో మృతి

బాధితుల్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు

ప్రైవేటు వైద్య ఖర్చుతో హడలిపోతున్న సామాన్యులు

గడిచిన వారం రోజుల్లో 50వేల మందికి జ్వరాలు

ఊరూరా జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ ఆస్పత్రులే కాదు ఆర్‌ఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ఏ ఆస్పత్రి చూసినా కిక్కిరిసి ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలో ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు డెంగీ బారిన పడటంతో బళ్లారి ఆస్పత్రికి చికిత్స చేయించారు. తాజాగా గుత్తి ఆర్ ఎస్ లో ఇద్దరు చిన్నారులు డెంగీ జ్వరంతో కోలుకోలేక ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేపుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు జ్వరాల బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సగటున 40 నుంచి 50 మంది ఔట్‌పేషెంట్లు చికిత్సకు వస్తే అందులో 15 మంది వైరల్‌ జ్వర పీడితులే ఉంటున్నారు. అనంతపురం సర్వజనాస్పపత్రిలో రోజూ 250 మందికి పైగా జ్వరబాధితులు చికిత్సకు వస్తున్నారు. చాలామంది చలి జ్వరంతో నడవలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందించాల్సిన పరిస్థితి వస్తోంది. పడకలు సరిపడక కొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు– చికిత్సల ఖర్చులు భారీగా ఉండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 50వేలమంది జ్వరాల బారిన పడినట్లు అంచనా. అందులోనూ చిన్నారులు కూడా జ్వరాలతో విలవిలలాడిపోతుండటం తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

చిన్నారులతో ప్రైవేటు ఆస్పత్రుల రద్దీ

జ్వరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉంటున్నారు. అనంతపురం సాయినగర్‌లోని ఓ చిన్నపిల్లల ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరాలతో చేరిన చిన్నారులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఒక్కో చిన్నారికి రూ.500 ఔట్‌పేషెంటు ఫీజు వసూలు చేస్తుండటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తపరీక్షలు, నెబులైజర్ల పేరిట రెండు మూడు రోజులకే రూ.15వేల వరకూ వసూలు చేస్తున్నట్టు వాపోతున్నారు.

డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

గుత్తి ఆర్‌ఎస్‌లో తాత వద్ద ఉంటూ చదువుకుంటున్న సంయుక్త అనే ఏడేళ్ల అమ్మాయి ఆరు రోజుల క్రితం డెంగీతో కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందింది. పాప తల్లిదండ్రులు ముదిగుబ్బలో నివాసం ఉంటారు. గుత్తికే చెందిన రెండేళ్ల హర్షిత్‌ అనే బాలుడు బుధవారం డెంగీతో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కానీ అనంతపురం జిల్లాలో డెంగీ మరణాలు లేవని, ఇప్పటివరకూ 37 కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.

 Patients queue for medical tests at Guntakal Government Hospital1
1/2

గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల కోసం బారులు తీరిన రోగులు

 Women undergoing treatment at Anantapur General Hospital2
2/2

అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement