
ప్రభుత్వానికి పట్టని ఉద్యోగుల సమస్యలు
● ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్ –1938) రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మండిపడ్డారు. ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ఎన్‌జీఓ హోంలో సన్మానించారు. విశిష్ట అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు, ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు హాజరయ్యారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక చొరవతో జిల్లా విద్యా వికాసాభివృద్ధికి పని చేస్తున్నారని కొనియాడారు. హృదయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడిచినా నేటికీ లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు, 4 విడతల డీఏలు, ఆర్థికేతర అంశాలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే భాగస్వామ్య సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ సింధు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, విశ్వనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఫీ, జిల్లా గౌరవ అధ్యక్షుడు వరప్రసాద్, ఐఫియా కమిటీ సభ్యుడు సత్యప్రసాద్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, అసోసియేట్ అధ్యక్షుడు పోతులయ్య, అదనపు కార్యదర్శి ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.