
కమలపాడులో దొంగల బీభత్సం
వజ్రకరూరు: మండలంలోని కమలపాడులో దొంగలు బీభత్సం సృష్టించారు. మాజీ ఎంపీపీ శైలజారాజశేఖరరెడ్డి ఇంటికి తాళం వేసిన గుర్తించిన దుండగులు ఆదివారం వేకువజామున లోపలకు చొరబడ్డారు. బీరువాతో పాటు వార్డు రోబ్‌ను తెరిచి అందులోని కీలకమైన డాక్యుమెంట్లు, రూ.10 వేల నగదు, ఐదు కిలోల వెండి, రెండు జతల బంగారు కమ్మలు అపహరించారు. అనంతరం అర్చకుడు దేవేంద్రస్వామి ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.1.5 లక్షల నగదు, అర కిలో వెండి సామగ్రిని అపహరించారు. గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న హుండీ తాళాలను బద్ధలుగొట్టి అందులోని సుమారు రూ.15 వేలను అపహరించారు. ఉదయం అనంతపురం నుంచి ఇంటికి చేరుకున్న శైలజారాజశేఖరరెడ్డి, అలాగే గుంతకల్లు ఉంచి కమలపాడుకు చేరుకున్న అర్చకుడు దేవేంద్రస్వామి చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నాగస్వామి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మాజీ ఎంపీపీ శైలజా రాజశేఖరరెడ్డి
ఇంట్లో చోరీ
ఐదు కిలోల వెండి, బంగారు
ఆభరణాలు, నగదు, దస్త్రాల అపహరణ
అదే గ్రామంలోని మరో ఇంట్లో
నగదు, అర కిలో వెండి చోరీ
గ్రామంలోని శివాలయంలో హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లిన దుండగులు