
రణభేరి జాతాను జయప్రదం చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యారంగ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లాలో ప్రవేశించనున్న రణభేరి జాతాను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర పాలక ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరిగింది. సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్ ప్రకటిస్తామని నమ్మబలికి లబ్ధి పొందిన తరువాత వారి న్యాయమైన సమస్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యే పశ్చిమ రాయలసీమ రణభేరి ప్రచార జాతా 16న గుంతకల్లులో ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం మీదుగా ప్రయాణిస్తూ మార్గమధ్యంన ఉపాధ్యాయులతో కలిసి చర్చించి సమస్యలను సేకరిస్తూ అనంతపురం చేరుకుంటుందన్నారు. జాతా వాహనంతో పాటు ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, జిల్లా సహాధ్యక్షులు రామప్ప, సహాధ్యక్షురాలు సరళ, కోశాధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా