
పరస్పర ఛాలెంజ్‌లతో కూడలిలో గొడవ
ఉద్రిక్తతల నడుమ పీఎస్‌కు చేరిన పంచాయితీ
గుత్తి: ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ గుత్తిలో టీడీపీ నేతల వర్గపోరుకు ఆజ్యం పోసింది. దమ్ముంటే రారా చూసుకుందామంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుని ప్రధాన రహదారిపైకి చేరుకుని గొడవకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేజారింది. ఉద్రిక్తతల నడుమ ఇరువర్గాలు చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పంచాయితీకి సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుత్తి పట్టణ టీడీపీ కన్వీనర్ ఎంకే చౌదరి, అదే పార్టీ నాయకుడిగా చెలామణి అవుతున్న జీఆర్పీ కానిస్టేబుల్ వాసు మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 10న సీఎం చంద్రబాబు సభకు జనాలను తరలించాలంటూ 24వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీనాథ్‌కు ఎంకే చౌదరి మూడు బస్సులు కేటాయించాడు. అయితే జనాలు ఉత్సాహం చూపకపోవడంతో బస్సులు ఫుల్ కాలేదు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనాథ్‌కు ఎంకే చౌదరిఫోన్ చేసి బస్సులు ఎందుకు ఫుల్ కాలేదని ఆరా తీయడంతో విషయాన్ని వెంటనే వాసు దృష్టికి శ్రీనాథ్ తీసుకెళ్లాడు. దీంతో ఎంకే చౌదరికి వాసు ఫోన్ చేసి ‘నువ్వు ఎవడివిరా నా మనిషిని బస్సులు ఫుల్ కాలేదని అడగటానికి’ అంటూ గద్దించాడు. దీనికి దీటుగానే ఎంకే చౌదరి కూడా స్పందించాడు.
ఫోన్‌లోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అనంతరం ఇద్దరూ ఛాలెంజ్‌లు విసురుకుని ఎవరికి వారు అనుచరులతో కలసి ప్రధాన రహదారిపై ఉన్న జీపు స్టాండ్ వద్దకు చేరుకుని గొడవకు దిగారు. పరిస్థితి విషమిస్తుండడంతో స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువర్గాల అనుచరులు పెద్ద సంఖ్యలో పీఎస్ వద్ద గుమికూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాసు తనను బెదిరించినట్లు ఎస్‌ఐ సురేష్‌కు ఎంకే చౌదరి ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.