
యూరియా లారీలను అడ్డుకున్న రైతులు
బొమ్మనహాళ్: తమ గ్రామానికి యూరియా సరఫరా కావడం లేదంటూ శుక్రవారం రాత్రి ఉప్పరహాళ్‌కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. శ్రీధరఘట్ట సొసైటీకి యూరియాను తరలిస్తున్న లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు... శుక్రవారం శ్రీధరఘట్ట సొసైటీకి ఒక లారీ, సింగానహళ్లి గ్రామంలో ఓ ప్రైవేట్ డీలర్‌కు మరో లారీలో యూరియ బస్తాలు తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఉప్పరహాళ్ గ్రామ రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో రెండు లారీలను గ్రామంలో అడ్డుకున్నారు. శనివారం ఉదయం గ్రామంలో యూరియాను గ్రామంలోని రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్, సిబ్బందితో కలసి ఉప్పరహాళ్ గ్రామానికి చేరుకుని రైతులతో చర్చించారు. తమ గ్రామానికి చెందిన రైతులకు ఇప్పటి వరకూ ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని, తాము పంటలు సాగు చేయడం లేదా అని ప్రశ్నించారు. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లితే శ్రీధరఘట్ట గ్రామానికి చెందిన రైతులకు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ లారీల్లో ఉండే యూరియా బస్తాలను ఇక్కడే ఇవ్వాలని అని డిమాండ్ చేశారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, సొసైటీ అధికారులతో ఎస్‌ఐ నబీరసూల్ మాట్లాడి ఉప్పరహాళ్ గ్రామానికి ఒక లారీ యూరియా కేటాయిస్తూ ఇక్కడే పంపిణీ చేయాలని సూచించారు. ఈ లారీలు ఇక్కడి నుంచి శ్రీధరఘట్ట సొసైటీకి వెళ్లాలంటే ఉప్పరహాళ్ రైతులకు హామీ ఇస్తేనే లారీలను పంపిస్తారని, లేకపోతే పరిస్థితి చెయ్యి దాటుతుందని హెచ్చరించారు. దీంతో ఉప్పరహాళ్ గ్రామానికి ప్రత్యేకంగా లారీ యూరియా పంపిణీ చేస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించారు.