
రేపు ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలు
252 మంది అభ్యర్థులకు రెండు పరీక్ష కేంద్రాలు
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని డీఆర్‌ఓ ఆదేశం
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (ఎన్‌డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్షలు జరగనున్నాయని డీఆర్‌ఓ మలోల తెలిపారు. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 252 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో యూపీపీఎస్‌సీ సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ దత్ మీనాతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్‌సీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జేఎన్‌టీయూ(ఏ) కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష మూడు సెషన్లుగా ఉదయం 9 నుంచి ఉదయం 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పేపర్–2, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పేపర్–3 జరుగుతాయన్నారు.
ఈ పరీక్షలకు 119 మంది హాజరవుతారని వెల్లడించారు. అనంతపురంలోని కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 133 మంది హాజరవుతారని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జేఎన్‌టీయూఏ కేంద్రానికి ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా ఎస్‌డీసీ తిప్పేనాయక్, రూట్ అధికారిగా ఎస్‌డీసీ రామ్మోహన్, కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఎస్‌డీసీ మల్లికార్జునుడు, రూట్ అధికారిగా మల్లికార్జునరెడ్డిని నియమించామని వెల్లడించారు. పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలని డీఆర్‌ఓ సూచించారు.