వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి

Sep 13 2025 4:17 AM | Updated on Sep 13 2025 7:59 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి

తోటలో పనులు చేయిస్తుండగా గుండెపోటు

పలువురు నాయకుల దిగ్భ్రాంతి..

రేపు అనంతపురం నుంచి తోపుదుర్తి వరకు అంతిమయాత్ర

ఆత్మకూరు/ అనంతపురం కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి (70) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి అనంతపురంలో నివాసముంటూ ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామం వద్ద ఉన్న తన పొలంలో కూలీలతో పనులు చేయించేవారు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా తన పొలంలో కూలీలతో పనులు చేయిస్తుండగా ఫోన్‌ రావడంతో కూలీల దగ్గర నుంచి పక్కకు వెళ్లారు. తర్వాత ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో పొలంలో పని చేసే వారు వెళ్లి చూడగా కిందపడి ఉన్నారు. వెంటనే అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. భాస్కర్‌రెడ్డికి కుమారుడు, కుమార్తె సంతానం.

అందరితో సన్నిహితంగా..

తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి 1987లో కాంగ్రెస్‌ నుంచి ఆత్మకూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయన సతీమణి తోపుదుర్తి కవిత 2006లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించాక దంపతులిద్దరూ జగన్‌ వెంట నడిచారు. రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న భాస్కర్‌రెడ్డి ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

పలువురి నివాళి

తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మరణ వార్త వినగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు అనంతపురంలోని నివాసం వద్దకు తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చందు, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, గంగుల భానుమతి, రమేశ్‌గౌడ్‌, తదితరులు భాస్కర్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సంతాపం తెలిపిన వారిలో అనంతపురం మేయర్‌ వసీం, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌, వైఎస్సార్‌ట్రేడ్‌ యూనియన్‌ నేత బెస్త రమణ, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వడిత్య గోవిందునాయక్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌రెడ్డి, తెలుగు వర్సిటీ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ పెదారపు చెన్నారెడ్డి ఉన్నారు.

రేపు అంత్యక్రియలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి అంతిమయాత్ర ఆదివారం ఉదయం 8 గంటలకు అనంతపురంలోని రామచంద్రనగర్‌ ఇంటివద్ద నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. యాత్ర ఆత్మకూరు మండలం తోపుదుర్తి వరకు సాగుతుందని, అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.

భాస్కర్‌రెడ్డి భౌతికకాయానికి పూల మాల వేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement