
మళ్లీ మొదలైన దందా..
ఈ ఏడాది సీజన్ మొదలు కావడంతో ‘గూండా ట్యాక్స్ 2.0’ మొదలైంది. ఓ ట్రాన్స్‌పోర్ట్ యజమాని, ఓ మండీ యజమాని రంగంలోకి దిగారు. వీరి ఆధ్వర్యంలోనే వసూళ్లు చేస్తున్నారు. రోజూ సగటున 190 దాకా వాహనాలు లోడింగ్ అవుతున్నాయి. అంటే రోజూ ఆదాయం రూ. 3 లక్షలకు పైమాటే. పరిటాల కుటుంబం పేరు చెప్పుకుంటూ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకోసం కొందరిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఉదయం ఏ మండీకి ఏయే వాహనాలు వచ్చాయో స్లిప్పులు రాసుకుని సాయంత్రం ఆయా మండీల యజమానులకు చెబుతారు. స్లిప్పుల్లో లెక్కల ప్రకారం ఎన్ని వాహనాలు వెళ్లి ఉంటే అంత డబ్బు చెల్లించాలి. ఇదంతా బయ్యర్ల నుంచి వసూలు చేస్తున్నా...వారు రైతులపై మోపుతారని వాపోతున్నారు. ‘టమాట మండీమే అప్‌సీ ఏక్ గాడీకు దో హజార్ గూండా ట్యాక్స్ బర్‌నా’ అంటూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు చెందిన బయ్యర్లు చర్చించుకుంటున్నారు. కాగా ‘టమాట లారీ లోడింగ్ రిసీప్ట్, ‘టమాట మినీ లారీ లోడింగ్ రిసీప్ట్’ పేరుతో రశీదులు ఇస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరి కోసం, ఎందుకోసం వసూళ్లు చేస్తున్నారో అన్న వివరాలు లేకపోవడంతో మండిపడుతున్నారు.