
చిన్నారిని బలిగొన్న బాటిల్ మూత
గుత్తి రూరల్: వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని రక్షత్‌రామ్ (18 నెలలు) అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులోని పవర్‌గ్రిడ్ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన మౌనిక పవర్‌గ్రిడ్ కేంద్రంలో ఏపీ ట్రాన్స్‌కో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీకి కుమారుడు రక్షత్‌రామ్‌ను తీసుకుని వెళ్లారు. కుమారుడు ఆడుకోవడానికి వాటర్ బాటిల్ ఇచ్చి విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బాటిల్ మూత తీసి మింగడానికి ప్రయత్నించడంతో గొంతులో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఏడీఈ, పవర్‌గ్రిడ్ ఉద్యోగులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతితో తల్లి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.