
మిర్చి రైతులకు రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ
బొమ్మనహాళ్: మిర్చి రైతులకు ఓ వ్యాపారి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టాడు. చెమటోడ్చి పండించిన పంటను వ్యాపారి చేతిలో పెడితో డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ బాధితులు వాపోతున్నారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ, దేవగిరి గ్రామాలకు చెందిన రైతుల నుంచి ప్రకాష్ అనే వ్యాపారి కొన్ని రోజుల క్రితం దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన మిర్చి కొనుగోలు చేశాడు. డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అడిగితే అదిగో ఇదిగో అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధిత రైతులు సూరి, రామచంద్ర, సుంకన్న, ఖలంధర్, గంగాధర, వన్నూరుస్వామి, కుమారి, మనోహర్, లోకేష్, మారెన్న, రామాంజి తదితరులు మంగళవారం బొమ్మనహాళ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎస్‌ఐ నబీరసూల్ వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
పోలీసుల అదుపులో
నలుగురు వడ్డీ వ్యాపారులు
ధర్మవరం అర్బన్: పట్టణంలోని శాంతినగర్‌లో రమణ, భారతి దంపతులపై దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారులు నలుగురు మంగళవారం లొంగిపోయారు. రమణ ఇంట్లోకి వడ్డీ వ్యాపారులు చొరబడి దాడి చేసిన వీడియో రాష్ట్రంలోనే సంచలనం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఏడుగురిపై కేసు నమోదు చేశారు. దాడి ఘటన తర్వాత నిందితులు పరారీలో ఉండగా.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు మంగళవారం ఓ న్యాయవాది ద్వారా డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు.