కార్లు సరే.. కంతుల్లేవ్‌ | - | Sakshi
Sakshi News home page

కార్లు సరే.. కంతుల్లేవ్‌

Jul 28 2025 7:55 AM | Updated on Jul 28 2025 7:55 AM

కార్లు సరే.. కంతుల్లేవ్‌

కార్లు సరే.. కంతుల్లేవ్‌

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆర్థిక స్థాయిని మించి కార్లు కొనుగోలు చేసిన వందలాది మంది నెలవారీ కంతులు కట్టలేక చతికిలపడుతున్నారు. ప్రతి వంద మందిలో పది నుంచి పదిహేనుమంది డిఫాల్టర్‌గా మారుతున్న పరిస్థితి. ఈఎంఐలు సరిగా కట్టకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఏడాదిగా లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు తలపట్టుకు కూర్చున్నాయి. ఎన్‌పీఏ (నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌) సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో బ్యాంకు సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా పోతోంది. కారు తీసుకున్నప్పుడు సిబిల్‌ స్కోరు బాగానే ఉన్నా తర్వాత.. కంతుల చెల్లింపుల్లో దారుణంగా విఫలమవుతున్నట్టు బ్యాంకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.

అలా వాడి.. ఇలా కుదువకు..

కొంతమంది యువకులు కారు తీసుకుని రెండు మూడు నెలలు జల్సాగా తిరుగుతున్నారు. ఆ తర్వాత కారును తక్కువ రేటుకు ఇతరుల దగ్గర కుదువకు పెడుతున్నారు. ఆ డబ్బుతో జల్సా చేయడం, బెట్టింగ్‌లు, క్రికెట్‌ పందేలు ఇలా రకరకాలుగా వెచ్చించి పోగొట్టుకుంటున్నారు. రికవరీ ఏజెంట్లు కారు స్వాధీనానికి వెళ్లినప్పుడు కుదువ పెట్టుకుని డబ్బు ఇచ్చిన యజమాని అడ్డం తిరుగుతున్నారు. కొన్ని చోట్ల రాజకీయ బలాలు ఉపయోగిస్తున్నారు.

రికవరీ ఏజెంట్ల కళ్లు గప్పి..

కార్లు లేదా ద్విచక్రవాహనాలు తీసుకున్న తర్వాత వరుసగా మూడు మాసాలు ఈఎంఐలు (నెలవారీ కంతులు) చెల్లించకపోతే రెపో ఏజెంట్లు వాహనం స్వాధీనానికి వస్తారు. కానీ ఏజెంట్లు ఎంత వెతికినా కార్లు దాచేస్తున్నారు. తాము వస్తున్నామన్న విషయం తెలుసుకోగానే మరోచోటుకు తెలివిగా మారుస్తున్నట్టు ఏజెంట్లు చెబుతున్నారు. ఒక్కోసారి రికవరీకి వెళ్లినప్పుడు దాడికి యత్నించిన సందర్భాలూ ఉన్నాయని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు మేనేజర్‌ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు..

కంతులు చెల్లించకుండా ఉన్న కార్లను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు కొంతమంది రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారు తీసుకుని కంతులు కట్టలేదు. దీంతో రెపో ఏజెంట్లు రికవరీ కోసం వచ్చారు. అప్పటికే సదరు కారు యజమాని బత్తలపల్లిలోని టీడీపీ నాయకుడి ఇంట్లో వాహనం పెట్టారు. అక్కడకు ఏజెంట్లు వెళ్లగా మీకు చేతనైతే తీసుకెళ్లండంటూ టీడీపీ నేత బెదిరించారు. పోలీసులు కూడా చేతులెత్తేయడంతో వెనుదిరిగారు. ఇక కోర్టుకు వెళ్లడం తప్ప చేసేదేమీ లేదని నిట్టూరుస్తున్నారు.

ఫైనాన్స్‌ సంస్థల్లో కలవరం

ఉమ్మడి జిల్లాలో భారీగా డిఫాల్టర్లు

లోను తీసుకున్న మూణ్నెళ్లకే

కారు కుదువకు

అనంతపురంలో ఈఎంఐలు కట్టని వందల కార్లు స్వాధీనం

ఏటా ఐదువేల కార్లకు లోన్లు ఇస్తున్న బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థలు

ఇందులో 15 శాతం ఎన్‌పీఏలుగా ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడి

కార్లకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జల్లెడ పడుతున్న రికవరీ ఏజెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement