ఖరీఫ్‌ కల్లోలం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ కల్లోలం

Jul 28 2025 7:55 AM | Updated on Jul 28 2025 7:55 AM

ఖరీఫ్‌ కల్లోలం

ఖరీఫ్‌ కల్లోలం

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌ కల్లోలంగా మారింది. వర్షాలు లేక ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. జూన్‌ 15 నుంచి దాదాపు నెలన్నర రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పదును వర్షం ఎక్కడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. తేలికపాటి వర్షాలకే పంటల సాగు కొనసాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ముంగారు’ మందగించడంతో అన్నదాత మరోసారి కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. పరిస్థితి ఘోరంగా కనిపిస్తున్నా కూటమి సర్కారు మాత్రం ఎలాంటి సాయం చేయకుండా చేతులెత్తేస్తుండటంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఖరీఫ్‌ సాగు 32 శాతం..

వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం 32 శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3,43,232 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి 1.08 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. నెలాఖరు నాటికి 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. అయినా ఇంకా 1.90 లక్షల హెక్టార్లు పంటలు లేక బీళ్లుగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, సజ్జ, కొర్ర లాంటి ప్రధాన పంటల సాగుకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుండంతో రైతుల ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయమే శరణ్యమని చెబుతున్నారు. నెలాఖరు నాటికి 40 శాతం విస్తీర్ణంలో పంటలు వచ్చినా ఇంకా 60 శాతం మిగిలిపోనుందని అంచనా వేస్తున్నారు.

ముఖం చాటేసిన వరుణుడు..

‘నైరుతి’ ఈ సారి మే 26న ముందస్తుగా పలకరించి మురిపించినా... విత్తు సమయం వచ్చే సరికి వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ 15 నుంచి ఒక్క మంచి వర్షం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. జూన్‌లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. కీలకమైన జూలైలో 63.9 మి.మీ గానూ ప్రస్తుతానికి 37 శాతం తక్కువగా 35 మి.మీ నమోదైంది. జూన్‌, జూలైలో వరుణుడు కరుణించకపోవడంతో తేలికపాటి నడుమ పంటలు వేశారు. రెండు మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి.

40 వేల హెక్టార్లకు

వేరుశనగ పరిమితం..

జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన పంట వేరుశనగ ఈ సారి కేవలం 40 వేల హెక్టార్లకు పరిమితమైంది. సాధారణ విస్తీర్ణం 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అందులో 22 శాతం విస్తీర్ణంలో మాత్రమే వేరుశనగ వేయడం గమనార్హం.అయితే కంది పంట సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా ఇప్పటికే 75 శాతం విస్తీర్ణంతో 42 వేల హెక్టార్ల సాగుతో సాధారణానికి చేరువైంది. ప్రస్తుతం సజ్జ పంట మాత్రమే 2,054 హెక్టార్లకు గానూ 2 వేల హెక్టార్లలో వేశారు. ఇక పత్తి పరిస్థితి దారుణంగానే ఉంది. 44 వేల హెక్టార్లకు గానూ 28 శాతంతో 12 వేల హెక్టార్లలో పత్తి విత్తుకున్నారు. ఆముదం పంట 16,293 హెక్టార్లకు గానూ 30 శాతంతో 4,800 హెక్టార్లలో వేశారు. మొక్కజొన్న 14,653 హెక్టార్లకు గానూ 58 శాతంతో 8,500 హెక్టార్లలో వేశారు. మిగతా పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. ఓవరాల్‌గా కంది, సజ్జ మినహా మిగతా పంటల సాగు పూర్తిగా చతికిలపడింది. వర్షాభావం, విత్తన సమస్య, పెట్టుబడి భారం తదితర కారణాలతో చాలా మంది రైతులు వేరుశనగ సాగుపై అనాసక్తి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది.

30 శాతం తక్కువగా వర్షపాతం

32 శాతం విస్తీర్ణంలోనే సాగులోకి పంటలు

40 వేల హెక్టార్ల కనిష్ట స్థాయికి వేరుశనగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement