
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట సమీపంలో అనంతపురం – తాడిపత్రి రహదారిపై శనివారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఉడాయించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా జీజీహెచ్‌కు తరలించారు. చికిత్సకు స్పందించక ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా, మరణానికి ముందు తన పేరు రవిచంద్ర అని, రాయదుర్గం పట్టణ వాసిగా ఆయన పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.