
డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా అందజేస్తున్న ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాల కోసం 08554– 275575లో సంప్రదించవచ్చు.
మహిళపై
దేవర దున్నపోతు దాడి
గుత్తి: మండల పరిధిలోని శ్రీపురం (కొజ్జేపల్లి) గ్రామానికి చెందిన అనంతమ్మపై మంగళవారం రాత్రి దేవర దున్నపోతు దాడి చేసింది. ఇంటి బయట నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతమ్మను కుటుంబ సభ్యులు తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
వివాహితపై అత్యాచార యత్నం
పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు మండలం ఎర్రపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన యువకుడు చంద్ర అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వరి కల్లాల వద్ద ఉన్న ఒంటరిగా వివాహితను గమనించిన చంద్ర అత్యాచారం చేయబోతే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో ఆమె గొంతు, మెడపై దాడి చేసి యువకుడు పరారయ్యాడు. బుధవారం ఉదయం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.