సినీ ఫక్కీలో ఛేజింగ్‌... లారీ పట్టివేత | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో ఛేజింగ్‌... లారీ పట్టివేత

Published Sun, Sep 17 2023 6:26 AM

రాయదుర్గం బైపాస్‌ వద్ద లారీని   చుట్టుముట్టిన పోలీసుల వాహనాలు  - Sakshi

రాయదుర్గం: కేరళ నుంచి న్యూఢిల్లీకి లోడ్‌తో వెళుతున్న ఓ లారీ శుక్రవారం రాత్రి కర్ణాటక జీఎస్టీ అధికారుల కళ్లు గప్పి తప్పించుకుని ఆంధ్రలోకి ప్రవేశించింది. ఆద్యంతం సినీ ఫక్కీలో సాగిన ఛేజింగ్‌లో చివరకు ఆంధ్ర ప్రాంతంలో లారీ టైర్‌ బరస్ట్‌ కావడంతో కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. వివరాలు... కేరళ నుంచి వస్తున్న లారీని కర్ణాటకలోని హనగల్‌ వద్ద జీఎస్టీ, సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూకించడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తమ వాహనాల్లో వెంబడిస్తూ మొలకాల్మూరు పోలీసులకు సమాచారం అందించారు.

దాదాపు 14 కిలోమీటర్ల మేర ఛేజింగ్‌ చేసినా లారీ వేగాన్ని పోలీసులు, జీఎస్టీ అధికారులు అందుకోలేకపోయారు. చివరకు రాయదుర్గం పట్టణ సమీపంలో నిర్మాణంలో ఉన్న బైపాస్‌ వద్దకు చేరుకోగానే టైర్లు బరెస్ట్‌ అయ్యాయి. వెనుకనే వెంబడిస్తూ వచ్చిన కర్ణాటక పోలీసులు, జీఎస్టీ అధికారుల వాహనాలు లారీని చుట్టుముట్టాయి. లారీ క్యాబిన్‌లో పరిమితికి మించి వ్యక్తులు ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే రాయదుర్గం అర్భన్‌ సీఐ లక్ష్మన్నకు సమాచారం ఇస్తూ తమకు భద్రత కల్పించాలని కోరారు. ఘటనాస్థలానికి ఆగమేఘాలపై సిబ్బందితో చేరుకున్న సీఐ లక్ష్మన్న జరిగిన అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.

అయితే ఏపీ పరిధిలోకి రావడంతో లారీని స్వాధీనం చేసుకుని తామే కేసు నమోదు చేస్తామని సీఐ తెలపడంతో కర్ణాటక అధికారులు వీల్లేదన్నారు. చివరకు విషయాన్ని తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి సుదర్శన్‌, డీసీటీఓ రమణ రాయదుర్గం చేరుకుని బళ్లారి జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ ఇనామ్‌ధీర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ అభిషేక్‌తో చర్చించారు. లారీలో ఉన్న సరుకుపై ఆరా తీశారు.

వక్కలోడుతో వెళుతున్నట్లుగా డ్రైవర్‌, అతడి సహాయకులు తెలిపారు. ముందుగా గుర్తించిన కర్ణాటక జీఎస్టీ అధికారులకే కేసు నమోదు బాధ్యతలు అప్పగించేలా అంగీకారానికి వచ్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ఇరు రాష్ట్రాల అధికారులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్టు పొందుపరిచారు. ఇదిలా ఉండగా లారీలో వక్క కాకుండా గంధం చెక్కలు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లోడ్‌ తీసి చూపకుండా లారీని కర్ణాటకకు జీఎస్టీ అధికారులు తరలించారు.

Advertisement
Advertisement