ఆస్పత్రి ఆవరణలో ప్రసవం | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఆవరణలో ప్రసవం

Published Wed, May 24 2023 8:17 AM

- - Sakshi

అనంతపురం క్రైం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం అప్పుడే పుట్టిన ఓ శిశువు మృతి చెందింది. ప్రసవ వేదనతో గర్భిణి ఆస్పత్రి ఆవరణలో ప్రసవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మజ, ఎస్‌ఎన్‌సీయూ వైద్యులు డాక్టర్‌ దినకర్‌, సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన మేరకు.. గుంతకల్లుకు చెందిన రాజా, షబానా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడో కాన్పు కోసం షబానా అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చేరారు.

మంగళవారం ఉదయం 9.30 గంటలకు తన ఇద్దరు పిల్లలతో కలసి ఆస్పత్రి ఆవరణలోని ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ విగ్రహం ఎదురుగా ఉన్న బల్లపై ఆమె కూర్చొని ఉండగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. విషయాన్ని గమనించిన అక్కడున్న వారందరూ గుమిగూడేలోపు గర్భం నుంచి బాబు నేలపై పడ్డాడు. విషయం తెలుసుకున్న డాక్టర్‌ పద్మజ వెంటనే ఎఫ్‌ఎన్‌ఓల సాయంతో షబానాను లేబర్‌ వార్డుకు తరలించారు.

అపస్మారక స్థితిలో ఉన్న పసికందు(బాబు)ను ఎస్‌ఎన్‌సీయూలో చేర్చి, డాక్టర్‌ దినకర్‌ పర్యవేక్షణలో అత్యవసర చికిత్చ చేపట్టారు. అయితే చికిత్సకు స్పందించక బాబు మృతి చెందాడు. నెలలు పూర్తి స్థాయిలో నిండకనే ప్రసవమైందని, నవజాత శిశువు కిలో బరువు మాత్రమే ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. షబానా తరఫున పద్మావతి అనే మహిళ వచ్చి పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను కోల్పోవడంతో షబానా కన్నీటిపర్యంతమైంది.

Advertisement
Advertisement