మళ్లీ చిరుత కలకలం
బుక్కరాయసముద్రం: మండలంలోని సంజీవపురంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళపై 3 రోజుల క్రితం చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ శుక్రవారం చిరుత ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే చిరుతను చూసిన గ్రామానికి చెందిన యువకులు రాళ్లు, కర్రలతో వెంబడించగా.. హెచ్‌ఎల్‌సీ వైపు పారిపోయింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రమూ సహాయక చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘పది’ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు తత్కాల్ కింద చివరి అవకాశం కల్పించారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు, 2025లో కొత్త సిలబస్ పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. హెచ్‌ఎంలను సంప్రదిస్తే వారి లాగిన్ ద్వారా వెబ్‌సైట్‌లో ఫీజు చెల్లిస్తారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు గడువు పెంచరని స్పష్టం చేశారు.
క్రీడలతో మానసికోల్లాసం
● ఎస్పీ జగదీష్
అనంతపురం సెంట్రల్: నిత్యం పని ఒత్తిడితో తలమునకలయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఎస్పీ జగదీష్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్‌లో ఏఆర్, స్పెషల్ పార్టీ విభాగాలతో కలిపి ఏడు క్రీడా బృందాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం 800 మీటర్ల పరుగు, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్, ట్రైనీ ఐపీఎస్ అశ్వినీ మణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
అ‘ధనం’ వసూలు చేయొద్దు
అనంతపురం అర్బన్: వంటగ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి బిల్లుపై అదనంగా డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులను హెచ్చరించారు. డీఎస్‌ఓ శుక్రవారం పౌర సరఫరాల శాఖలోని తన చాంబర్‌లో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్ బిల్లుపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఏవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో వస్తోందన్నారు. దీని ప్రకారం జిల్లాలో 10 గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చే సంజాయిషీ మేరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో జరిమానా విధిస్తామన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు తమ ఏజెన్సీలోని డెలివరీ బాయ్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. సీఎస్‌డీటీలు తమ పరిధిలోని ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డెలివరీని పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్‌ఓ శోభరాణి, సీఎస్‌డీటీలు, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.
మళ్లీ చిరుత కలకలం
మళ్లీ చిరుత కలకలం


